- వెయ్యికి పైగా పోర్న్ కంటెంట్ వీడియోస్ గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: చైల్డ్ పోర్న్ వీడియోలను విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు ట్రేస్ చేశారు. వెస్ట్ బెంగాల్ కేంద్రంగా చిన్నారుల పోర్న్ వీడియోలను ఆన్లైన్లో విక్రయిస్తున్న సైబర్ క్రిమినల్‌ను ఆదివారం అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. నిందితుడి ఫోన్లో వెయ్యికి పైగా వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని కొనుగోలు చేసిన 46 మంది వివరాలుసేకరించారు.
విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైబర్ పెట్రోలింగ్ వివరాలను డీజీ శిఖా గోయల్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్‌ను ఆన్లైన్లో విక్రయిస్తున్న వారిని షీ సైబర్ ల్యాబ్‌లోని ప్రత్యేక టూల్స్ ద్వారా గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ వీడియోలను గుర్తించారు. 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేశారు.
Also Read:-ఆరామ్ సే పోవచ్చు..రావచ్చు
ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో వెస్ట్ బెంగాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బీర్భూమ్ జిల్లా మొంగల్దిహికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి ట్రాన్సిట్ వారంట్‌పై అతడిని హైదరాబాద్ కు తరలించారు. టెలిగ్రాం గ్రూప్స్ సహా ఇతర ప్రైవేట్ డిజిటల్ చానెల్స్ లో నిందితుడు చైల్డ్ పోర్న్ వీడియోలను అమ్మినట్లు గుర్తించారు. అతని ఫోన్ లో మొత్తం వెయ్యికి పైగా చైల్డ్ పోర్న్ కంటెంట్ వీడియోలను గుర్తించారు. ఫోన్ పే,పేటీఎం లాంటి పేమెంట్ గేట్ వేస్ ద్వారా నిందితుడు ట్రాన్సాక్షన్ చేసినట్లు కనుగొన్నారు.
రాష్ట్రంలో 12 కేసులు.. 14 మంది అరెస్ట్
విమెన్ సేఫ్టీ వింగ్‌లోని షీ సైబర్ ల్యాబ్ ద్వారా ఆన్లైన్ సైబర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 300 ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. వీటిలో 180 చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ కాగా 115 యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, 3 సైబర్ క్రైం, 2 డొమెస్టిక్ వయెలెన్స్ మాడ్యూల్స్‌ను గుర్తించారు. 180 చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ ఆధారంగా 65 ఇంటెలిజెన్స్ రిపోర్టులను తయారు చేశారు.
వీటిని దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల పోలీసులకు అందించారు. ఆయా రాష్ట్రాల్లో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ వీడియోలు సర్క్యులేట్ చేయడంతో పాటు విక్రయిస్తున్న వారి ఫోన్ నంబర్లు, ఐపీ అడ్రెస్‌లను చేరవేశారు. ఇందులో రాష్ట్రంలో 12 కేసులు నమోదు కాగా 14 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నమోదైన మరో 8 కేసుల్లో ఏడుగురిని ఆయా రాష్ట్రాల పోలీసులు అరెస్ట్ చేశారు.